ప్రకృతితో మంచి సంబంధం అనేది మీరు పల్లెలో ఉన్నా, పట్నంలో ఉన్నా, అడవి మధ్యలో ఉన్నా, సముద్రతీరాన ఉన్నా, మీకు ఇప్పటికే సత్సంబంధం ఉన్నా కూడా ఇంకా పెంపొందించుకోవచ్చు. మీ చుట్టూ ఉండే ప్రదేశాలు, ప్రాణులు, వాటి చేష్టలను గురించి ఆలోచించడానికి ఈ క్రింది ప్రశ్నలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. మనకు అలవాటై ఇవి సహజమే అనిపించవచ్చు కానీ, కొంత ఆలోచిస్తే ఇవి నమ్మశక్యం కానివి అని తెలుస్తుంది. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు మీరు మాటల్లో చెప్పవచ్చు లేకుంటే బొమ్మలు దించడం, ఏదైనా పదార్థంతో రూపం తయారుచేయడం వంటి ఆసక్తికరమైన పద్దతుల్లో కూడా తెలపవచ్చు..
- మీకు ఇష్టమైన ప్రాణి ఏది?
(మనుషులు కాని, మీరు పెంచుకొనే జంతువులు కాకుండా మరేదైనా చెప్పండి. ప్రకృతిలో మీకు కనిపించే జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు, క్రిములు ఏవైనా అవ్వచ్చు.)
- ఆ ప్రాణి అంటే మీకు ఎందుకు ఇష్టం?
(దాని గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయండి. మీకు తెలియకపోతే, తెలుసుకొనే ప్రయత్నం చేయండి.)
- ఏ ప్రాణి మీ జీవితం మీద అతి పెద్ద ప్రభావం చూపించింది?
(మీకు సమాధానం ఇవ్వడం కష్టమైతే, మీ రోజువారీ జీవితంలోని ఈ క్రింది అంశాల్లో ఆ ప్రాణి ప్రభావితం చేసి ఉంటుంది – ఆహారం/ వైద్యం/ పని సులభతరం చేయడం/ వస్తువులు తయారుచేయడం/ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం)
- ఈ ప్రాణి లేకపోతే మీ జీవితంలో జరిగే మార్పు ఏమిటి?
- ఏ ప్రాణి మీద మనుషులు చాలా పెద్ద ప్రభావం చూపించారు?
(మీకు వన్యప్రాణులతో ఉన్న సంబంధం, లేక మనుషులు చేసే పనుల గురించి అలోచించే ప్రయత్నం చేయండి.)
- చాలా రకాల ప్రాణుల్ని ఒకే చోట లేక ఒకే సమయంలో మనుషులు ప్రభావితం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
- మనుషులు ఇతర ప్రాణులపై మంచిగా లేదా చెడుగా ప్రభావితం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా?
- ప్రకృతిని ఆస్వాదించడానికి, మీకు ఇష్టమైన ప్రదేశమేది?
(ఈ ప్రదేశం చిన్నదైనా, పెద్దదైనా, దగ్గరిదైనా, దూరమైనా కావచ్చు. ఒక వేళ అలాంటివి లేకపోతే మీ ఇంట్లో కిటికీల్లో నుండి కాసేపు చూసి, ఎక్కడ ఎక్కువ మొక్కలు, పక్షులు, పురుగులు మొదలైన ప్రాణులు కనిపిస్తున్నాయో గమనించండి.)
- మీరు ఎంచుకున్న ప్రదేశంలో ఏది ప్రత్యేకంగా కనబడుతోంది?
(ఎలాంటి ప్రాణులు కనిపిస్తున్నాయి? అవి ఎలాంటి ఆసక్తికరమైన పనులు చేస్తున్నాయి?)
- ఏ ప్రదేశాన్నైనా, ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ఉండేందుకు మీరేమి చేయగలరు?
