హాయ్! నా పేరు ప్రీతి. నేను తేనెటీగలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తను – అంటే వాటి ఆహారం, వైవిధ్యం, ఉండే వాతావరణం మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాను. నా స్నేహితురాలు పేరు రాబిన్. ఆమె సేంద్రియ వ్యవసాయం చేస్తోంది.
ఒకసారి, రాబిన్ తన పొలంలోని చెత్త డబ్బాలో ఒక తేనెటీగల గుంపుని కనుగొన్నది. ఆ తేనెటీగలు కొన్ని నెలలుగా తమ తుట్టెను చెత్త డబ్బాలో ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నాయి. రాబిన్ వాటిని చూసి ఆనందించి, అప్పుడప్పుడు వాటిని పరిశీలించడం ప్రారంభించింది. జూన్ 2020లో ఒక ఉదయాన, రాబిన్ చెత్త డబ్బా దగ్గర చనిపోయిన తేనెటీగలు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించింది. అలాగే చెత్త డబ్బా మూత రోజూ కంటే ఎక్కువగా తెరిచి ఉంది. లోపల నుండి తేనెపట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దెబ్బతిన్న ఆ తేనెతుట్టెను మళ్ళీ నిర్మించడానికి తేనెటీగలు చాలా కష్టపడుతున్నాయి.
రాబిన్ చనిపోయిన తేనెటీగల గురించి నాకు చెప్పింది. నేను ఉత్సాహంతో తనిఖీ చేయడానికి అక్కడికి వెళ్ళాను. వేసవిలో తేనెతుట్టె దగ్గర మగ తేనెటీగలు చనిపోవడం చాలా సహజం – ఎందుకంటే ఈ సమయంలో పువ్వులు దొరకడం చాలా కష్టం. ఆహార కొరత వల్ల, ఆడ తేనెటీగలు మగతేనెటీగలను తేనెపట్టు దగ్గరకు రానివ్వవు. కానీ ఆశ్చర్యంగా డబ్బా దగ్గర చనిపోయిన తేనెటీగలలో ఒక్క మగ తేనెటీగ కూడా లేదు!

అక్కడ చనిపోయినవి అన్నీ ఆడ తేనెటీగ కార్మికులు. వీటికి తేనెతుట్టెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎవరైనా తేనెను దొంగిలించడానికి వస్తే, అవి వాటి శరీరంలోని ప్రమాదకరమైన ముల్లుతో దాడి చేస్తాయి. ఆ ముల్లుతో పాటుగా వాటి కడుపు కూడా దాడి చేయబడ్డ శరీరంలో ఉండిపోయి, ఆ ఆడ కార్మికులు కూడా చనిపోతాయి. అయితే, అక్కడ చనిపోయిన తేనెటీగలను పరిశీలిస్తే వాటి ముల్లు కూడా పోలేదు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి డబ్బా చుట్టూ గమనించాను. ఒక ఆసక్తికరమైనది కనుగొన్నాను – అది ముంగిసకి చెందిన మలం!
ఆ మలం యొక్క ఆకారం, కొలతలు మరియు దానిలో ఉన్న వాటిని గమనిస్తే, అది భారతీయ బూడిద రంగు ముంగిస యొక్క మలం అని గుర్తించాను. ఈ ముంగిస మలం మన చిటికెన వేలు అంత మందంగా, చిన్న పురుగులు మరియు జంతువుల శరీర భాగాలు కలిగి ఉంటుంది. ఈ పొలం పరిసరాలలో కనిపించే ఈ ముంగిసే తేనెతుట్టె దగరికి వచ్చి ధ్వంసం చేసిందనే నిర్ధారణకు వచ్చాము.
చిన్న చిన్న పురుగులు ముంగిసకు ఆహారం. కాబట్టి, తేనెటీగలను తినడానికే ముంగిస వాటిపై దాడి చేసిందని మేము అనుమానించాము. కానీ మాకు చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఒకవేళ ముంగిస తేనెటీగలను తినడానికి వస్తే, అక్కడ ఉన్న కొన్ని వందల తేనెటీగలను ఎందుకు తినకుండా వెళ్ళిపోయింది? తేనెతుట్టెను ఎందుకు నాశనం చేసింది? చెత్త డబ్బా చుట్టూ తేనెపట్టు విరిగిన ముక్కలు ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నలకు జవాబులు కనుక్కోవాలని మాకు ఆతృతగా అనిపించింది.

ముంగిస తినే ఆహారంపై కొంత పరిశోధన చేయడం కోసం మేము పుస్తకాలు మరియు ఇంటర్నెట్ వెతికాము. ముంగిసలు పక్షులు, చిన్న చిన్న ఎలుకలు, పురుగులు, పాములు, బల్లులు మరియు పండ్లను తింటాయని మేము తెలుసుకున్నాము. కొన్ని అధ్యయనాల్లో ముంగిసలు తేనెటీగలను కూడా తింటాయని తేలింది. కానీ తేనెతట్టుకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం దొరకక, మేము తలలు పట్టుకున్నాము. అలా ఆలోచిస్తుండగా మాకు ఒక ఆలోచన తట్టింది! ముంగిస తేనె తినడానికి డబ్బా దగ్గరికి వచ్చి ఉంటుంది. అది తేనె తినే క్రమంలో తేనెతుట్టెను తన్ని ఉంటుంది, దీంతో ఆడ తేనెటీగలు ముంగిస మీద దాడి చేసి ఉండవచ్చు. భారతీయ ముంగిస యొక్క మందమైన గట్టి బొచ్చు, దాన్ని విషపూరితమైన పాము కాటు నుంచి కూడా కాపాడుతుందని ప్రసిద్ది. కాబట్టి ముంగిసను కుట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ, తేనెటీగలు అలసటతో చనిపోయి ఉండవచ్చు అని ఊహించాము.

ఈ విధంగా చనిపోయిన తేనెటీగల రహస్యాన్ని మేము పరిష్కరించాము! కానీ శాస్త్రవేత్తలు ముంగిస తినే ఆహారంలో, తేనెను ఎందుకు చెప్పలేదని మీరు అడగవచ్చు! మలంలో తేనె కనిపించకపోవడమే దీనికి కారణం.
సైన్స్‌లో ఒక సమాధానం తరచుగా మరొక ప్రశ్నకు దారి తీస్తూ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇంకో ప్రశ్న వచ్చింది – ముంగీసకు తియ్యటి పదార్థాలంటే ఇష్టమా అని. మరి మీలో ఏ ప్రకృతి పరిశోధకురాలు/ పరిశోధకుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతారు?